Narla chiranjeevi biography in telugu

Chiranjeevi: చిరంజీవికి వచ్చిన కల.. అలా పేరు మార్చుకున్నారు..!

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో అసలు పేరుకన్నా స్క్రీన్‌ నేమ్‌తోనే పాపులర్‌ అయిన వ్యక్తులు ఎంతోమంది. శివ శంకర వర ప్రసాద్‌ ఎవరో తెలుసా? అని ఉన్నపళంగా అడిగితే సినిమాల గురించి కాస్తో కూస్తో తెలిసిన వాళ్లు టక్కున చిరంజీవి (Chiranjeevi) అని చెప్పేస్తారు.  తెలుగు సినీ పరిశ్రమ అగ్ర కథానాయకుల్లో ఒకరైన ఆయన కోట్ల మంది తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరో. అయితే, ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారో ఓ సందర్భంలో పంచుకున్నారు.

‘‘మనం సినిమా యాక్టర్‌ అయిపోతే, శివ శంకర్‌ వరప్రసాద్‌ అని తెరపై కనిపిస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుందనిపించింది. అలాగని, శివ.. శంకర్‌.. ప్రసాద్‌.. ఇలా ఏ పేరు పెట్టుకున్నా, ఇప్పటికే వచ్చిన పేరులా అనిపిస్తోంది. ప్రత్యేకమైన పేరు ఉంటే బాగుంటుందనుకున్నా. సాధారణంగా మనకు వచ్చిన కలలు గుర్తు ఉండవు. కానీ, ఒకరోజు నాకొచ్చిన కల అలా గుర్తుండిపోయింది. నేను రాములవారి గర్భగుడి ముందు సొమ్మసిల్లి పడుకుని ఉన్నాను. ఆ సమయంలో ఓ పదేళ్ల అమ్మాయి గుడిలోకి వచ్చి, ‘ఏంటి చిరంజీవి ఇక్కడ పడుకున్నావ్‌. బయటకెళ్లి పని చూసుకో. టైమ్‌ అయింది’ అని అనేసరికి నేను లేచాను. చూట్టూ చూస్తే ‘ఇదేంటి గుడిలో ఉన్నాను’ అనిపించింది. ‘నా పేరు శివ శంకర్‌ కదా.. ఆ పాప చిరంజీవి అని పిలవడమేంటి? నేను ఉలిక్కిపడి లేవడమేంటి’ అనుకుంటూ వస్తుండగా, గుడి గోడ బయట నుంచి నా స్నేహితుడు కూడా ‘చిరంజీవి రా రా వెళ్దాం’ అని పిలిచాడు. ఇదేంటి  అందరూ నన్ను అలా పిలుస్తున్నారు అని అనుకుంటుండగా నిద్ర నుంచి మెలకువ వచ్చింది. అసలు చిరంజీవి అని ఒక పేరు ఉంటుందని నాకు అప్పటివరకూ తెలియదు. ఇదే విషయాన్ని అమ్మకు చెబితే ‘స్క్రీన్‌నేమ్‌గా ఇదే ఎందుకు ఉండకూడదు’ అని అన్నారు. దీంతో తెరపై నా పేరు అడిగితే ‘చిరంజీవి’ అని చెప్పేశా. అలా నా స్క్రీన్‌ నేమ్‌ చిరంజీవి అయింది’’ అని చెప్పుకొచ్చారు.

ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’లో (Vishwambhara) నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాగా ఇది రూపొందుతోంది. త్రిష కథానాయిక. మీనాక్షి చౌదరి, సురభి, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.